Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సమీకరించి, సమర్థవంతంగా వినియోగించే విధానాన్ని అమలు చేస్తోంది. కేంద్రం ప్రాయోజిత పథకాల ద్వారా ఎక్కువ నిధులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూనే, రాష్ట్ర స్థాయిలో యంత్రాంగాన్ని చురుగ్గా నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తీసుకున్నారు. నిధులు సమకూర్చడం, సమర్థంగా ఖర్చు చేయడం, అదనపు వనరులు సాధించడం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. నెల వ్యవధిలోనే రెండు సార్లు సమీక్షలు నిర్వహించి, స్పష్టమైన లక్ష్యాలను అధికారులకు నిర్దేశించారు.
వివరాలు
ఇతర పథకాలకి రూ.10,171కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత 76 పథకాల కింద రాష్ట్ర,కేంద్ర వాటాలను కలిపి మొత్తం రూ.24,513 కోట్ల నిధులను పొందడంలో ప్రభుత్వం విజయవంతమైంది. గత జగన్ ప్రభుత్వ పాలనలో ఐదేళ్ల కాలంలో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.39,642 కోట్ల నిధులు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు, మరో రూ.10,171కోట్లను ఇతర పథకాల వైపు మళ్లించారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ పరిస్థితిని సరిదిద్దుతూ సుమారు రూ.17వేల కోట్ల మేర ఖర్చు చేసి పథకాలను మళ్లీ గాడిలో పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.15,173 కోట్లను కేటాయించగా,రాష్ట్ర వాటాగా మరో రూ.9,340 కోట్లు జోడయ్యాయి.
వివరాలు
మొత్తం రూ.24,513 కోట్లను 76 పథకాలపై ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు
ఈ విధంగా మొత్తం రూ.24,513 కోట్లను 76 పథకాలపై ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను ప్రస్తుతం రెండు విధానాల్లో అమలు చేస్తున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడంతో, కేంద్ర ప్రభుత్వం కొత్త చెల్లింపు విధానాలను తీసుకొచ్చింది. అందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) విధానం,అలాగే స్పర్శ్ (సింగిల్ నోడల్ ఖాతా) విధానం ఉన్నాయి. సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానంలో కేంద్రం విడుదల చేసే నిధులు ముందుగా రాష్ట్ర ఖజానాకు చేరుతాయి. అనంతరం బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయా నోడల్ ఏజెన్సీలకు నిధులను విడుదల చేస్తుంది. ఈ విధానం లోపభూయిష్టమని గుర్తించిన కేంద్రం, తాజాగా స్పర్శ్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
వివరాలు
ప్రయోజనం పొందుతున్న 21 లక్షల మందికి పైగా లబ్ధిదారులు
ఈ విధానం ప్రకారం, ప్రతి కేంద్ర ప్రాయోజిత పథకానికి రాష్ట్రం ప్రత్యేకంగా ఒక సింగిల్ నోడల్ ఖాతాను ఏర్పాటు చేయాలి. కేంద్రం ఇచ్చే వాటా, రాష్ట్రం ఇచ్చే వాటా - రెండూ నేరుగా ఆ ఖాతాలోకే జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో అనేక లాభాలు కనిపిస్తున్నాయి. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పోషణ 2.0 పథకానికి స్పర్శ్ విధానంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.1,007 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 21 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
వివరాలు
లక్షలాది విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు
సమగ్ర శిక్షా అభియాన్ పథకంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత బిల్లులను చెల్లించడంతో,గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అదనంగా రూ.1,240.10కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వాటా కలిపి మొత్తం రూ.1,893.50 కోట్లను వెచ్చించడంతో 35లక్షల మంది విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మొత్తం రూ.1,854కోట్లను సింగిల్ నోడల్ ఖాతాలో ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉంచగా,ఇప్పటివరకు రూ.1,446కోట్లను వినియోగించారు. దీని ఫలితంగా లక్షలాది విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి రూ.550 కోట్లను కేటాయించారు. అయితే ఈ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోవాల్సి ఉంది.
వివరాలు
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రూ.111 కోట్లు
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రూ.111 కోట్లను మంజూరు చేయగా,ఇప్పటివరకు రూ.62 కోట్లను ఖర్చు చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు రూ.1,838 కోట్లను వెచ్చించారు.అలాగే జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా గర్భిణులు,నవజాత శిశువులు,చిన్నారుల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు రూ.1,001 కోట్లను మంజూరు చేయగా,అందులో ఇప్పటివరకు రూ.187 కోట్లను ఖర్చు చేశారు. గత నెల 17వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం రూ.10,362కోట్ల మేరకే ఖర్చు జరగింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపిస్తోందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడంతో,నెల పూర్తికాకముందే మరో రూ.2,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి మూడో విడతనిధులు పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.