రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 27వ కేసు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి గురువారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లోని గదిలో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతుడిని మొహమ్మద్ తన్వీర్(20)గా గుర్తించారు. ఈ ఏడాది కోటాలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కి చెందినవాడు. కోటాలో తన సోదరి,తండ్రితో కలిసి ఉండేవాడు. అతని తండ్రి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో11, 12 తరగతుల విద్యార్థులకు క్లాసస్ చెప్పేవాడు. అతని సోదరి కూడా అతనితో పాటు నీట్‌కు సిద్ధమవుతున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విద్యార్థులు డిప్రెషన్ పై ప్రశ్నావళిని సిద్ధం చేసిన జిల్లా అధికారులు
గత కొన్ని నెలలుగా ఆత్మహత్యల కేసుల్లో పెరుగుదల స్థానిక అధికారులలో ఆందోళనలను పెంచింది. సీలింగ్ ఫ్యాన్లలో యాంటీ హ్యాంగింగ్ పరికరాలను అమర్చడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు రెండు నెలల పాటు ఎటువంటి పరీక్షలను నిర్వహించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు డిప్రెషన్‌తో సతమతమవుతున్నారో లేదో తెలుసుకునేందుకు జిల్లా అధికారులు విద్యార్థుల కోసం ప్రశ్నావళిని సిద్ధం చేశారు. ఈ పరీక్షలో వచ్చే మార్కులను బట్టి విద్యార్థుల్లో ఎవరు డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారో నిర్ణయిస్తారు.