LOADING...
Ebola: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ
బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ

Ebola: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వ్యాధి ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన ఓ మహిళలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఆమెను వెంటనే ప్రత్యేక వైద్య పర్యవేక్షణలోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల మహిళ ఈ నెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు, ఆమెను పరిశీలించిన సమయంలో స్వల్ప అనారోగ్య లక్షణాలను గుర్తించారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

వివరాలు 

రెండు రోజుల్లో పరీక్షల ఫలితాలు

ఆమె రక్త నమూనాలను సేకరించిన వైద్యులు, మరింత నిర్ధారణ కోసం పుణెలోని జాతీయ వైరస్ పరిశోధన సంస్థకు పంపించారు. మరో రెండు రోజుల్లో పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే స్పందించారు. మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు. ఆమెలో కనిపించిన లక్షణాలు నిజంగా ఎబోలాకు సంబంధించినవేనా కాదా అనే విషయంపై పరీక్షల అనంతరం మాత్రమే స్పష్టత వస్తుందని తెలిపారు.

వివరాలు 

రష్యా కీలక ప్రకటన

ఇదిలా ఉండగా, ఎబోలా వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల మధ్య రష్యా కీలక ప్రకటన చేసింది. బుండిబుగ్యో రకానికి చెందిన ఎబోలాపై సమర్థంగా పనిచేసే టీకాను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. కొత్తగా గుర్తించిన ఎబోలా రకానికి ఈ టీకా రక్షణ కల్పిస్తుందని పేర్కొంది.

Advertisement