
Amit Shah: మూడు కీలక బిల్లులు లోక్‌సభ లో ప్రవేశపెట్టిన అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల ప్రకారం తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ ఆత్మకు, సమాఖ్యవాద సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులని ఆరోపించాయి. అంతేకాకుండా, ఈ చట్టాలను తొందరపాటుగా తీసుకొచ్చారని విమర్శించాయి. అయితే, అమిత్ షా ఈ ఆరోపణలను ఖండిస్తూ, బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్టు స్పష్టం చేశారు.
వివరాలు
బిల్లుల ప్రతులను చించి సభలో విసిరేసిన ప్రతిపక్ష ఎంపీలు
బిల్లుల ప్రవేశపెట్టిన సందర్భంలో సభలో అధికార పక్షం-విపక్షం మధ్య వాగ్వాదం తలెత్తింది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించి సభలోకి విసిరేశారు. అదేవిధంగా నినాదాలు చేస్తూ వెల్ వైపు దూసుకెళ్లారు.గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు దీనికి సమాధానమిస్తూ అమిత్ షా, తాను అరెస్టు కాకముందే నైతిక కారణాల దృష్ట్యా పదవి నుంచి రాజీనామా చేశానని, అనంతరం కోర్టు నిర్దోషిగా తేల్చిన తర్వాతే మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించానని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారెవ్వరూ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం సరైంది కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నిరసనలు కొనసాగుతుండటంతో చివరికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
వివరాలు
కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరంలో పాలుపంచుకుని అరెస్టయితే..
ప్రతిపాదిత బిల్లుల ప్రకారం తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై, వరసగా 30 రోజులు జైలులో ఉన్నవారు ఎవరు అయినా—ప్రధాని, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి.. తమ పదవులను ఆటోమేటిక్‌గా కోల్పోవాల్సి వస్తుంది. కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరంలో పాలుపంచుకుని అరెస్టయి నెలరోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు నుంచి వారి పదవి రద్దవుతుంది. వారు స్వయంగా రాజీనామా చేయకపోయినా, ఈ కొత్త చట్టం ప్రకారం ఆ హక్కు వారికి ఉండదు; పదవి కోల్పోవడం తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.