Page Loader
అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం

అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 09, 2023
06:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ బొగ్గు గని కుప్పకూలిన ఘోర ఘటన జార్ఖండ్‏ రాష్ట్రంలోని ధన్‎బాద్‎లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడం కోల్ మైన్స్ లో కలకలం రేపుతోంది. దేశంలోనే అధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ కు పేరు ఉంది. ఇక్కడ నాణ్యమైన సీ గ్రేడ్ బొగ్గు దొరుకుంది. మరోవైపు పలువురు కార్మికులు బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చు అని కార్మికులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఓవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ కృషి చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బొగ్గు తవ్వకాలు అక్రమంగా జరుపుతున్నందునే భద్రతా ప్రమాణాలు లేక ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.

DETAILS

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి : డీఎస్పీ

బొగ్గు గని కూలిన ఘటన సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రెస్క్యూ బృందంతో కలిసి సహాయక చర్యలను ప్రారంభించారు. కోల్ మైనింగ్ సంస్థ ఖనిజాలను వెలికితీసేందుకు బొగ్గుగనికి సమీపంలో నివసిస్తున్న పలు గ్రామాల ప్రజలను సదరు కంపెనీ నియమించుకుందని సింధ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల నుంచి స్థానికులు, ముగ్గురిని బయటకు వెలికితీసి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారని డీఎస్పీ స్పష్టం చేశారు. శిథిలాల వద్ద పూర్తిస్థాయిలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని వివరించారు.