Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు.
ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కృష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చోటు చేసుకుంది.
కృష్ణగిరి కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
జనవరి 3వ తేదీ నుండి బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. దీంతో నెల రోజులుగా పాఠశాలకు ఎందుకు రావడం లేదంటూ ప్రిన్సిపల్ నేరుగా బాలిక ఇంటికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ బాలిక ప్రస్తుతం గర్భవతి అయ్యింది.
వివరాలు
ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
పాఠశాల యాజమాన్యం సూచనపై, బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనను బర్గూర్ ఆల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బాలిక కుటుంబాన్ని చైల్డ్ సేఫ్టీ అధికారితో సంప్రదింపులు చేపడితే, వారు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.