Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. ముఖ్యమైన భూసేకరణ కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పూర్తిచేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడ్డంకి ఉండదు. 300 ఎకరాల భూమి సంబంధిత పత్రాలను గురువారం కేంద్రానికి అప్పగించడం జరిగింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను తెలంగాణ ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) కు అప్పగించింది. ఈ పత్రాలను గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న 'వింగ్స్ ఇండియా' కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు.
వివరాలు
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు - డిప్యూటీ సీఎం
అలాగే, రూ.850 కోట్లతో మామునూరు విమానాశ్రయంలో రన్‌వే, ఆధునిక టెర్మినల్ భవనాల నిర్మాణం ప్రారంభించాలని, రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం 300 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించడం తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలుగా లిఖించదగ్గ రోజు. 1930లో నిజాం కాలంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అతిపెద్దవిగా ప్రసిద్ధి చెందింది. మామునూరు వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణ తర్వాత భూసేకరణను పూర్తిచేశాం," అని పేర్కొన్నారు.
వివరాలు
వీలైనంత త్వరలో శంకుస్థాపన: మంత్రి పొంగులేటి
భూసేకరణ పత్రాల అప్పగింత కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,"ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉంది. ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. మన తెలుగు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండడం ఎంతో గర్వకారణం," అన్నారు. "వరంగల్ ప్రజల పదేళ్ల కోరిక అయిన ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం వారు ఎంతగానో ఎదురుచూశారు. అక్కడి రైతులను ఇద్దరు శాసనసభ్యులు ఒప్పించి,పూర్తి సహకారంతో భూములను ఎయిర్‌పోర్ట్ కోసం కేంద్రానికి అప్పగించారు. వీలైనంత త్వరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగాలని ఆశిస్తున్నాం,"అని మంత్రి పొంగులేటి తెలిపారు.
వివరాలు
అవసరమైన భూములను ప్రభుత్వం వెంటనే అప్పగించడానికి సిద్ధం: పొంగులేటి
"రాష్ట్రంలో కొత్తగూడెం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్ అవసరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేలా కేంద్రమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అనుమతులు అందిన వెంటనే, వాటికి అవసరమైన భూములను ప్రభుత్వం వెంటనే అప్పగించడానికి సిద్ధంగా ఉంది" అని మంత్రి పొంగులేటి తెలిపారు.