Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం
పూనే పోర్ష్ కారు ప్రమాద ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీనేజ్ యువకుడ్ని తప్పించటానికి అతని కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. ఘటన గురించి తెలియగానే రక్తపు శాంపిళ్లను తారు మారు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పథకాన్నినడిపారు. ఫోర్సెనిక్ ల్యాబరేటరీ డాక్టర్లకు 3 లక్షలు లంచం ఇవ్వచూపారు. దీనికి ప్యూన్ అతుల్ ఘట్కాంబల్లే మధ్య దళారీగా వ్యవహరించాడు. దీనిని ఇద్దరు డాక్టర్లకు ప్యూన్ ఇచ్చాడు.అంతకు ముందు ఇద్దరు డాక్టర్లతో టీనేజ్ యువకుడి తండ్రి మాట్లాడాడు. అంతే డబ్బులు చేతిలో పడగానే డాక్టర్ల బుర్ర చురుగ్గా పని చేయటం ప్రారంభించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు సస్సాన్ ఆసుపత్రిలో టీనేజ్ యువకుడు రక్తపు నమూనాలు ఇచ్చాడు .
ఏకంగా శాంపిళ్లనే మార్చేశారు
ఆసుపత్రి ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హల్నార్ , సూచనకు అనుగుణంగా ల్యాబరేటరీ ఇన్ ఛార్జి అజయ్ తవాడే వాటిని మార్చేశారని తెలుస్తోంది. కాగా ముందుగా ఇచ్చిన శాంపిళ్లను చెత్త బుట్టలో పడేశారు. ఆ శాంపిళ్ల ప్రకారం రూపొందించిన రిపోర్ట్ మద్యం తాలూకు ఆనవాళ్లు లేవని తెలిపింది. దీనిపై అనుమానం వచ్చిన పూనే క్రైంబ్రాంచ్ పోలీసులు వేరే ల్యాబ్ కి పంపారు. వాటిలో మాత్రం మద్యం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని తేల్చింది. దీంతో అనుమానం మరింతగా బలపడటంతో ఇద్దరు డాక్టర్లను పూనే క్రైంబ్రాంచ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్యూన్ కూడా అరెస్ట్ అయ్యాడు.
ఏ ఒక్కరినీ వదలబోం: పూనే పోలీసు కమిషనర్
ఇదిలా వుంటే దీనికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని పూనే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తేల్చి చెప్పారు. మరో మలుపు ఏమంటే సిసి టివి ఫూటేజీని తనిఖీ చేస్తే టీనేజ్ యువకుడు బార్ లో మద్యం సేవించాడని చూపుతోంది. మే19నాటి ప్రమాద ఘటనలో ఇద్దరు ఐటి ఉద్యోగులు బైక్ పై నుంచి కింద పడి చనిపోయారు. ఆ సమయంలో పోర్ష్ కారు వేగం 200 కిలో మీటర్లు గా నమోదైంది.