కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని
మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది. కునో నేషనల్ పార్కులో రెండు చీతాలు తీవ్రంగా తలపడ్డాయి. ఘటనలో ఓ చిరుతపులి తీవ్రంగా గాయపడింది. భారతదేశంలో అంతరించిపోయిన చిరుతపులుల సంతతిని పెంచేందుకు ఆఫ్రికా ఖండం నుంచి భారత్ కు చీతాలను తరలించారు. వాటిలో కొన్ని మరణించగా, ప్రస్తుతం ఉన్నవి పోట్లాడుకుంటున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుత పులులకు గౌరవ్, శౌర్య అని పేరు పెట్టారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి తరలించిన చీతాలకు అగ్ని, వాయు అని నామకరణం చేశారు. అయితే సోమవారం తెల్లవారు జామున ఈ నాలుగు చీతాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి.
ఫారెస్ట్ లో క్రూర మృగాల ఫైటింగ్ మామూలే: అటవీ అధికారులు
సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఫ్రీ రేంజ్ ప్రాంతంలో చీతాలు కొట్టుకున్నాయి. ఘటనతో అప్రమత్తమైన జూ అధికారులు భారీగా బాణాసంచా పేల్చుతూ వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఫారెస్ట్ లో క్రూర మృగాల ఫైటింగ్ మామూలేనని అటవీ అధికారులు వెల్లడించారు. అయితే దాడిలో అగ్ని తీవ్రంగా గాయపడిందని ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 5 ఆడ, 3 మగ చీతాలను గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని మోదీ కునో నేషనల్ పార్కులోకి వదిలారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతపులులను తీసుకురాగా అందులో 6 చీతాలు చనిపోయాయి. మరణించిన చిరుతలలో 3 కూనలు కూడా ఉండటం గమనార్హం.