తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనున్నట్లు పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నట్లు వెల్లడించింది. కామారెడ్డిలోని బిక్కనూరు మండలంలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడమే ఎండల తీవ్రతకు అద్దం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది.
గురువారం 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
అలాగే రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, సిద్ధిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కుమురంభీం జిల్లా, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కూడా గురువారం 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ విడుదల చేసింది.