LOADING...
Kuno National Park: కునో పార్కులో నాలుగు చీతా కూనల మృతి
కునో పార్కులో నాలుగు చీతా కూనల మృతి

Kuno National Park: కునో పార్కులో నాలుగు చీతా కూనల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో విషాద ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల వయసున్న నాలుగు చీతా కూనలు మంగళవారం ఉదయం మృతిచెందాయి. మరో అడవి జంతువు దాడి చేయడంతోనే అవి చనిపోయి ఉండొచ్చని అటవీ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో పర్యవేక్షణ బృందం ఈ ఘటనను గుర్తించింది. 'కేజీపీ-12' పేరుగల ఆడ చీతా ఈ ఏడాది ఏప్రిల్‌ 11న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. మే 11 సాయంత్రం వరకు కూనలు ఆరోగ్యంగానే కనిపించాయని అధికారులు తెలిపారు. అయితే మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో డెన్ సమీపంలో వాటి కళేబరాలు కనిపించాయని వెల్లడించారు. కొన్ని భాగాలను ఇతర జంతువులు తినివేసిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ఈ ఏడాది ఫిబ్రవరిలో బోట్స్వానా నుంచి తొమ్మిది చీతాలు 

కూనల తల్లి చీతా మాత్రం సురక్షితంగా, ఆరోగ్యంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు. కూనల మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, పూర్తి స్థాయి విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో దేశంలో చీతాల సంఖ్య 53కు తగ్గింది.ప్రస్తుతం కునో పార్కులో 50చీతాలు ఉండగా, వాటిలో 33 భారత్‌లోనే జన్మించినవిగా అధికారులు తెలిపారు. మరో మూడు చీతాలు గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాయి. మిగిలిన చీతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. భారత్‌లో చీతాల పునరావాస కార్యక్రమంలో భాగంగా 2022లో నమీబియా నుంచి ఎనిమిది,2023లో సౌత్ ఆఫ్రికా నుంచి 12చీతాలను తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బోట్స్వానా నుంచి మరో తొమ్మిది చీతాలను భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Advertisement