మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిని అస్సాంలోని గువహటికి తరలించారు. నిందితులను పావోమిన్‌లున్ హాకిప్, మల్సాన్ హాకిప్, లింగ్‌నీచాంగ్ బైట్, తిన్నెఖోల్‌లుగా గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థినికి లింగ్‌నీచాంగ్ బైట్ స్నేహితుడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిందితుల్లో మరొకరు చురచంద్‌పూర్‌లోని తిరుగుబాటు గ్రూపు సభ్యుని భార్య అని సమాచారం. ఇంఫాల్‌కు 51 కి.మీ దూరంలో ఉన్న హిల్ జిల్లా చురచంద్‌పూర్‌లో నిందుతులను మణిపూర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ యొక్క క్రాక్ యూనిట్ జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు.
ఇంఫాల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
నిందుతులను పట్టుకున్న తర్వాత బలగాలు నేరుగా ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ సీబీఐ బృందానికి నిందితులకు అప్పగించారు. సీబీఐ బృందం నిందితులను ఇంఫాల్ నుంచి గువహాటికి విమానంలో తీసుకెళ్లారు. నిందితులు అరెస్టు గురించి తెలుసుకున్న కొందరు వ్యక్తులు విమానాశ్రయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపాయి. ఎయిర్‌పోర్ట్ సెక్యుటీ సీఐఎస్ఎఫ్ అప్రమత్తం కావడంతో విమానాశ్రయం వద్ద ఒక గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ విమానాశ్రయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు కొన్ని తిరుగుబాటు గ్రూపులతో చేతులు కలిపి కుట్ర పన్నినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో ఎన్ఐఏ ఒక అనుమానితుడిని కూడా అరెస్టు చేసింది.