LOADING...
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడి.. 40 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
40 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడి.. 40 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అథోలి పోలీస్ స్టేషన్‌పై కర్రలు,ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఒక కమాండింగ్ ఆఫీసర్,మేజర్‌తో పాటు మొత్తం 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్. అరుణ్ గాంధీ,మేజర్ వికాశ్ శర్మ,నయిబ్ సుబేదార్ శంకర్ గుర్కేతో పాటు మరో 40 మంది ఆర్మీ జవాన్లపై కేసు నమోదైంది.

వివరాలు 

పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆర్మీ సిబ్బంది దాడి

ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం,పోలీస్ స్టేషన్‌లోకి బలవంతంగా ప్రవేశించడం,విధుల్లో ఉన్న పోలీసులను విచక్షణారహితంగా కొట్టడం వంటి ఆరోపణలతో హత్యాయత్నం,ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కిష్టవార్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఒక ఆర్మీ వాహనాన్ని నిబంధనల ప్రకారం సీజ్ చేయడమే కారణమని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుందని, అనంతరం ఆర్మీ సిబ్బంది కర్రలు, ఇనుప రాడ్లు, సర్వీస్ ఆయుధాలతో ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ఈ ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్న రక్షణ శాఖ

ఈ దాడిలో డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, ఎస్‌హెచ్‌వో అమృత్ కాటోచ్‌తో పాటు పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అలాగే మేజర్ వికాశ్ శర్మ అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ ఎస్‌డీపీఓపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకోవడంతో రక్షణ శాఖ అధికారికంగా స్పందించింది. ఘటనపై జరుగుతున్న దర్యాప్తుకు భారత ఆర్మీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పోలీసు, మిలిటరీ సంయుక్త విచారణ అనంతరం తప్పు చేసిన వారిపై ఆర్మీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement