
ISRO: ఆపరేషన్ సిందూర్ సమయంలో అహర్నిశలు శ్రమించిన 400 ఇస్రో శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ సమయంలో 400 మందికి పైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ వీ. నారాయణన్ వెల్లడించారు. ఎర్త్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్ శాటిలైట్ల పనితీరును నిరంతరం పరిశీలిస్తూ, జాతీయ భద్రత అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాల ద్వారా కీలకమైన సమాచారాన్ని అందించామని చెప్పారు. దిల్లీలో జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(AIMA)52వ నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని వివరించారు. 'ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని ఉపగ్రహాలు అత్యంత కచ్చితత్వంతో పనిచేశాయి. అవసరమైన డేటాను సమయానుకూలంగా అందించాయి. 400కు పైగా శాస్త్రవేత్తలు 24 గంటలు, నిరంతరం పూర్తి సమయంతో పనిచేశారు. భూ పరిశీలన, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఉపగ్రహాలన్నీ సంపూర్ణ సేవలందించాయని ఆయన స్పష్టం చేశారు.
Details
2,300 పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు
అలాగే గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు 7,700 క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాయని, మరో 2,300 పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని నారాయణన్ తెలిపారు. ఆయన ఇంకా పేర్కొన్నదేమిటంటే, జాతీయ భద్రతా సందర్భాలు, సరిహద్దు సంక్షోభం వంటి క్లిష్ట సమయాల్లో అంతరిక్ష సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆపరేషన్ సిందూర్ సమయంలో అది మరోసారి రుజువైందన్నారు. ఆ సమయంలో విస్తృతంగా డ్రోన్లు, మందుగుండు సామగ్రి వినియోగించగా, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌తీర్ వంటి రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను పరీక్షించడంలో కూడా ఇస్రో ముఖ్య భూమిక పోషించిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇస్రో పలు రక్షణ శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని ఆయన వివరించారు.