
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ కైలాష్ ట్రెక్ నుండి 400 మందికిపైగా యాత్రికులను రక్షించిన ITBP,NDRF
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ కైలాష్ ట్రెక్ మార్గంలో అకస్మాత్తుగా ఏర్పడిన వరదలతో రెండు తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో చాలా మంది యాత్రికులు ట్రెక్ మార్గంలో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP),నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (NDRF) కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మొత్తం 413 మంది యాత్రికులను జిప్‌లైన్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం ఉదయం కిన్నౌర్ జిల్లా యంత్రాంగానికి అక్కడే ఇరుక్కుపోయిన యాత్రికుల ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ITBP ని అప్రమత్తం చేయగా, వారు ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారు.
వివరాలు
టాంగ్లింగ్ డ్రెయిన్ వద్ద కొట్టుకుపోయిన వంతెన
ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఐస్ ఆక్స్, క్రాంపాన్స్, రోప్స్, హార్నెస్, మౌంటెనీర్ బూట్లు వంటి పర్వతారోహణ, గ్లేసియర్ క్రాసింగ్, ప్రమాదం నుంచి రక్షణ పొందే ప్రత్యేక సామగ్రిని పంపించారు. ఈ సమయంలో టాంగ్లింగ్ డ్రెయిన్ వద్ద వంతెన కొట్టుకుపోవడం, కిన్నౌర్‌లో భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడం గమనించాల్సిన అంశం. ఇటీవల ITBP తమ అధికారిక సోషల్ మీడియా 'X' లో ఈ రెస్క్యూ దృశ్యాలను షేర్ చేసింది. అందులో యాత్రికులు జిప్‌లైన్ ఉపయోగించి మార్గం దాటి సురక్షితంగా బయటపడుతున్న దృశ్యాలు కనిపించాయి. రోప్ రెస్క్యూ ట్రావర్స్ క్రాసింగ్ టెక్నిక్ ఉపయోగించి ఈ సహాయక చర్యను విజయవంతంగా నిర్వహించారు.
వివరాలు
హిమాచల్‌లో భారీ నష్టం, 194 మంది మృతి
జూన్ 20 నుంచి ఆగస్టు 5 వరకూ హిమాచల్‌లో వర్షాలు, వరదలు, మేఘ విస్ఫోటనాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (SDMA) నివేదిక ప్రకారం, ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 108 మరణాలు ప్రత్యక్షంగా వరదలు,ల్యాండ్‌స్లైడ్లు, మేఘ విస్ఫోటనాలకు సంబంధించినవే. ఇప్పటివరకు సుమారు రూ. 1.85 లక్షల కోట్లు (1,85,251.98 లక్షలు) ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇందులో రూ. 97,129.91 లక్షల ప్రైవేట్ ఆస్తుల నష్టం కాగా, రూ. 63,341.15 లక్షలు ప్రభుత్వ ఆస్తుల నష్టం.
వివరాలు
ముమ్మరంగా సహాయక చర్యలు
మరోవైపు, హిమాచల్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (HPSDMA) నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 446 రోడ్లు, 360 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 257 నీటి సరఫరా పథకాలు ప్రస్తుతం నిలిచిపోయాయి. అంతేగాక, మూడు జాతీయ రహదారులు - NH-305, NH-003 మరియు NH-05 కూడా మూసివేయబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద సవాలుగా మారింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.