Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు
17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు. చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన మూడు బృందాలు సొరంగం లోపలికి వెళ్లి 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రెస్క్యూ సైట్‌లో ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి,బయటకు వచ్చిన కార్మికులను కలిసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా ఉన్నారు. సొరంగంలోని కార్మికులను రక్షించిన వెంటనే, వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిక్కుకున్న కార్మికులను తరలించడానికి ఉపయోగించే అంబులెన్స్‌ను చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సదుపాయాలకు చేరుకోవడానికి "గ్రీన్ కారిడార్"ఏర్పాటు చేశారు.
సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్
నవంబర్ 12న, ఉత్తరకాశీలో సొరంగంలోని ఒక భాగం కూలిపోయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో సొరంగం లోపల 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది, రక్షకులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటి నుండి కార్మికులకు బయటి నుంచి గొట్టం ద్వారా తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ పంపించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. బయటకు వచ్చిన కార్మికులను చుసిన కుటుంబసభ్యులు అంతా భావోద్వేగానికి గురయ్యారు.