Luthra Brothers: 42 కంపెనీలకు ఒక్కటే అడ్రస్.. లూథ్రా బ్రదర్స్ వ్యాపారాలపై దర్యాప్తులో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
గోవాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ యజమానులు, సహోదరులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్‌లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో లూథ్రా బ్రదర్స్ వ్యాపారాలకు సంబంధించిన పలు అనుమానాస్పద అంశాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. విచారణలో భాగంగా,వీరు ఇతరులతో కలిసి నిర్వహిస్తున్నమొత్తం 42కంపెనీలు దిల్లీలోని ఒకే చిరునామాను ఉపయోగిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు,ఎల్‌ఎల్‌పీల రూపంలో ఉన్న ఈ సంస్థల్లో ఇద్దరు సోదరులూ డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్నట్లు దర్యాప్తు నివేదికలు సూచిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఒకే భవనం చిరునామాతో నమోదు కావడం వల్ల,ఇవి డమ్మీ కంపెనీలు అయ్యే అవకాశముందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
వివరాలు
గోవా అంతటా క్లబ్‌లు,రెస్టారెంట్‌లలో విస్తృత తనిఖీలు
ఈ అంశంపై మరింత స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. అగ్ని ప్రమాదం సమయంలో అవసరమైన కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే మంటల విస్తరణకు కారణమైందని అధికారులు పేర్కొన్నారు. బేస్‌మెంట్ ప్రాంతంలో సరైన లైటింగ్ లేకపోవడం, బయటకు వెళ్లేందుకు తగిన ఎగ్జిట్ మార్గాలు లేకపోవడం వల్ల అనేక మంది లోపలే చిక్కుకుపోయారని తెలిపారు. ఈ ఘటన తర్వాత గోవా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్న క్లబ్‌లను ఈ బృందాలు ఇప్పటికే మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
"మాపై రాడ్లతో దాడి చేశారు".. ముంబయి యువతి ఆరోపణ
నవంబర్ 1న తన బంధువులతో కలిసి 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌కు వెళ్లినప్పుడు, అక్కడి సిబ్బంది అసభ్యంగా వ్యవహరించినట్లు ముంబయికి చెందిన వైభవ్ చందేల్ అనే యువతి ఆరోపించారు. క్లబ్‌లో ఒక్కటే ఎంట్రెన్స్, ఎగ్జిట్ ఉండటం వల్ల లోపలికి వెళ్లడంలో ఇబ్బందులు ఎదురవడంతో, దీనిపై తాము వివరణ అడిగితే క్లబ్ మేనేజర్ ప్రతికూలంగా స్పందించాడని ఆమె తెలిపింది. అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, తన సోదరుడు అనుకోకుండా ఒక కుర్చీని తన్నడంతో, కోపోద్రిక్తులైన బౌన్సర్‌లు రాడ్లతో తమపై దాడి చేశారని ఆమె వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.