ISRO: జోషిమఠ్ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. డిసెంబర్ 27, 2022 నుంచి జనవరి 8, 2023(12రోజుల్లో) మధ్య జోషిమఠ్ పట్టణంలో 5.4 సెం.మీ మేర కుంగిపోయినట్లు తన తాజాగా నివేదికలో ఇస్రో పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయినట్లు చెప్పింది. ఈ గణాంకాలను పరిశీలంచగా జోషిమఠ్‌లో భూమి చాలా వేగంగా కుంగిపోతోందని వివరించింది. 2180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారి సమీపంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఇస్రో తన నివేదికలో చెప్పింది.
కొన్ని పట్టణాల్లో ఏటా 2.5 అంగులాల భూమి కుంగిపోతోంది: శాస్త్రవేత్తలు
ఉత్తరాఖండ్‌లోని కొన్ని పట్టణాలు కూడా మనిగిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ పట్టణాల్లో ప్రతి సంవత్సరం కొంత భూమి కుంగిపోతున్నట్లు గుర్తించారు. జోషిమఠ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏటా 2.5 అంగులాల మేరకు భూమి కుంగిపోతున్నట్లు పేర్కొన్నారు. పగుళ్లు వచ్చిన ఇళ్లలోని ప్రజలను ఆర్మీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. అవసరమైతే మరింత మంది ఆర్మీ సిబ్బందిని జోషిమఠ్‌కు పంపుతామని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఎన్టీపీసీతోపాటు రైల్వే ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇలాంటి మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.