జోషిమఠ్ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జోషిమఠ్‌తో ఆగిపోదని, రాబోయే సంవత్సరాల్లో అనేక హిమాలయ పట్టణాలు, గ్రామాలు మునిగిపోతాయని పర్యావరణ నిపుణుడు విమ్లెందు ఝా హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో 66కుపైగా సొరంగాలు నిర్మించినట్లు, దశాబ్దాలుగా డ్యామ్‌లు నిర్మిస్తున్నారని విమ్లెందు ఝా చెప్పారు. నిర్మాణాలు చేపట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్న ప్రభుత్వం వినిపించుకోలేదని నాన్‌స్టాప్‌గా తవ్వడం, భూగర్భంలో బ్లాస్టింగ్ చేయడం వల్లే.. వినాశానికి కారణమవుతోందని ఝా ట్వీట్ పేర్కొన్నారు.
'5దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నా వినలేదు'
హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఎన్టీపీసీతోపాటు రైల్వే ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మైదాన ప్రాంతాల్లో నిర్మాణాల్లో చేపట్టినట్లు హిమాలయాల్లో చేపట్టడానికి పర్యావరణం అనుకూలించదని, ఇదే విషయాన్ని నిపుణులు గత 5దశాబ్దాలుగా చెబుతున్నారని విమ్లెందు ఝా చెప్పారు. దిల్లీ లేదా మైదాన ప్రాంతాలతో హిమాలయాలను పోల్చలేమన్నారు. హిమాలయ ప్రాంతాలు చాలా సున్నితమైనవని, వాటిని అలాగే ఉంచాలని ఝా పేర్కొన్నారు. జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలో రాష్ట్ర ప్రభుత్వానికి రూర్కీ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయం చేస్తోంది. జోషిమఠ్‌లో కూల్చివేతకు సంబంధించి దాఖలైన అత్యవసర విచారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై ఈ నెల 16న విచారణ చేపడతామని చెప్పింది.