LOADING...
Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి 
బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం ఊహించని రీతిలో భారీ భూకంపం నమోదైంది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:08 గంటల సమయంలో రాజధాని ఢాకాలో స్పష్టంగా ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఢాకాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డే ప్రాంతంలో ఎపికెంటర్‌ను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కంపనం ఉత్పత్తి అయినట్లు సమాచారం. ఈ ప్రకంపనల ప్రభావం ఢాకాలో జరుగుతున్న బంగ్లాదేశ్-ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్‌పైనా పడింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో మ్యాచ్ కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది. పరిస్థితి సాధారణం కావడంతో స్వల్ప విరామం తర్వాత మళ్లీ ఆట కొనసాగించారు.

వివరాలు . 

కోల్‌కతాలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు

అయితే ఇప్పటి వరకూ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇక ఈ ప్రకంపనలు భారత్‌ను కూడా తాకాయి. కోల్‌కతా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 సమయంలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు అనుభవించారు. బెంగాల్‌లోని కూచ్‌బెహార్, దక్షిణ్ దినాజ్‌పూర్, ఉత్తర్ దినాజ్‌పూర్ తదితర జిల్లాల్లో కూడా కంపనలు నమోదయ్యాయి. గువాహటి, అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లోనూ భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనేక మంది అప్రమత్తంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.