Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే
తమిళనాడులోని మెరీనా బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనకు కారణం తొక్కిసలాట లేదా నిర్వహణ లోపం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ప్రకటనలో, ఆస్పత్రిలో చేరిన చాలామంది డిశ్చార్జి అయ్యారని, ఇంకా చికిత్స పొందుతున్న ఇద్దరు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ షో విస్తృత ప్రచారం పొందింది, తద్వారా సుమారు 15 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారని రక్షణ దళాలు పేర్కొన్నాయి. బీచ్ రోడ్డుపై 14-15 కిలోమీటర్ల మేర జనాలు గుమిగూడారు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,ఎండ తీవ్రత వల్ల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
అన్నాడీఎంకే,బీజేపీ తీవ్ర విమర్శలు
ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు కొందరు సబర్బన్, మెట్రో రైళ్లు ఆశ్రయించగా, అక్కడ కూడా తోపులాటలు జరిగాయి. ఈ ఘటనపై అన్నాడీఎంకే,బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. సమన్వయం లోపం, తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నాడీఎంకే నేత పళనిస్వామి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా ఇతర ముఖ్య నాయకుల రాజీనామా కోరాయి. డీఎంకే నాయకుడు శరవణన్ దీనిపై స్పందిస్తూ, షో నిర్వహణలో ఎటువంటి లోపం లేదని,ఐదుగురు మృతి చెందిన కారణాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతలు,రద్దీ కారణం అయ్యాయని ఆయన వివరించారు. అలాగే,డీఎంకే ఎంపీ కనిమొళి ఈ ఘటనపై స్పందిస్తూ, రద్దీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మృత్యువులు చోటుచేసుకోవడం చాలా బాధాకరమని తెలిపారు.