
Red Fort: ఎర్రకోటలోకి చొరబాటుకు యత్నం.. ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన ఒక భద్రతా సుదీర్ఘ డ్రిల్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భద్రతా నిర్వహణలో తీవ్ర భద్రతా లోపం ఉన్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, డ్రిల్‌లో భాగంగా ఉంచిన డమ్మీ బాంబును గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
వివరాలు
డిల్లీ పోలీసుల నిర్వహణలో స్పెషల్ డ్రిల్
స్వాతంత్ర్య వేడుకలకు ముందస్తు సన్నాహకంగా ఎర్రకోటలో స్పెషల్ డ్రిల్ నిర్వహించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, కొందరు భద్రతా సిబ్బంది సాధారణ పౌరుల వేషధారణలో డమ్మీ బాంబుతో లోపలికి ప్రవేశించారు. అయితే, అప్పటికే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ బాంబును గుర్తించలేకపోవడంతో వారి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో, భద్రతా విభాగం సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామన్న పోలీస్ అధికారులు
ఈ ఘటన నేపథ్యంలో భద్రతపై మరింత దృష్టి సారించనున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి పొరపాట్లు ఇకపై పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి కీలక సందర్భాల్లో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
వివరాలు
ఎర్రకోటలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు
ఇక మరోవైపు, ఎర్రకోట భద్రతకు మరో సవాల్ ఎదురైంది. ఐదుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులు అక్రమంగా ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 20 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండగా, అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి ఉద్దేశాలు ఏమిటన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నామని వెల్లడించారు.