West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన బలమైన గాలుల కారణంగా పలు గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ తుపాను కారణంగా ఇప్పటివరకు 5 మంది మరణించగా, 500 మంది గాయపడ్డారు. అయితే, ఆదివారం ఏరియా మేజిస్ట్రేట్ షామా పర్వీన్ 4 మంది మరణించినట్లు చెప్పారు. కాగా ఇప్పుడు మరో మహిళ మృతిని కూడా ధృవీకరించారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాన్ వార్తలపై స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో భారీ నష్టం వాటిలిందన్నారు.
తుపాను కారణంగా లక్షలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి
ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు అనేక మంది గాయపడ్డ వారి కుటుంబాలకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తన సానుభూతి తెలిపారు. సీఎం తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆదివారం రాత్రి జల్పాయ్ గురి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రజలను కలుసుకునేందుకు జల్పైగురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌ను తాకిన తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది.మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో తుపాను వచ్చి దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో లక్షలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ తుపాను కారణంగా 5 మంది మరణించగా, 500 మంది గాయపడినట్లు సమాచారం.
బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది: మమతా
అంతకుముందు ఆదివారం, జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ షామా పర్వీన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు నలుగురు మరణించారని, మృతులను ద్విజేంద్ర నారాయణ్ సర్కార్ (52), అనిమా రాయ్ (49), జోగెన్ రాయ్ (70), సమర్ రాయ్ (64)గా గుర్తించారు. కాగా, తుపాను కారణంగా ఓ మహిళ కూడా చనిపోయిందని వార్తలు వచ్చాయి. మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిందని, దాని కారణంగా చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయని ,ఐదుగురు మరణించారని అన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాలనా యంత్రాంగం అక్కడే ఉందని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.
మమతా బెనర్జీ చేసిన ట్వీట్
ఆకస్మిక తుఫానుపై స్పందించిన ప్రధాని మోదీ
అంతకుముందు ఆదివారం, జల్పాయిగురి జిల్లాలో తుఫాను సృష్టించిన విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి-మైనాగురి ప్రాంతాల్లో తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకు నా సానుభూతి అని మోదీ రాశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత ప్రజలను ఆదుకోవాలని నేను బెంగాల్ బిజెపి కార్యకర్తలందరినీ కూడా కోరుతాను అని ప్రధాని చెప్పారు. గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా బాధిత ప్రాంతాలను సందర్శించేందుకు సోమవారం జల్పాయ్‌గురికి వెళ్లనున్నట్లు రాజ్‌భవన్ అధికారులు తెలిపారు.