Jammu and Kashmir : కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం
గత కొన్ని రోజులుగా తరచూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది. సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను.. భద్రతా బలగాలు మట్టుబెడుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు నిత్యం ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలను ఎక్కడికక్కడ సైన్యం,పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. కాగా కుల్గామ్ జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణ త్యాగం చేశారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా భద్రతా బలగాలు ఆపరేషన్
మొదటి ఎన్‌కౌంటర్ మోదర్‌గామ్ గ్రామంలో జరిగింది. ఇక్కడ లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్ అనే పారా కమాండో వీర మరణం పొందారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఫ్రిసల్ చిన్నిగాం గ్రామంలో రెండో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 1వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది దాగి వున్నట్లు భావిస్తున్నారు.