LOADING...
Traffic Jam: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

Traffic Jam: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతదేశాన్నిభారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా అనేక రహదారులు పూర్తిగా మూసుకుపోయి, రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా చండీగఢ్‌-కులూ-మనాలి జాతీయ రహదారి అనేక ప్రాంతాల్లో బ్లాక్‌ కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వేలాది వాహనాలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు. సుమారు 50 కి.మీ పొడవునా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినట్లు వివరించారు.

వివరాలు 

సరుకు తరలిస్తున్న అనేక ట్రక్కులు ట్రాఫిక్‌లో

ఈ మార్గం ద్వారానే దేశ రాజధాని ఢిల్లీకి పెద్ద మొత్తంలో పండ్లు, కూరగాయలు రవాణా అవుతుంటాయి. ప్రస్తుతం ఆ సరుకు తరలిస్తున్న అనేక ట్రక్కులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరఫరా అంతరాయం కలగకుండా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, సాధారణ ప్రయాణికుల వాహనాలను నిలిపివేస్తూ చర్యలు చేపట్టారు. కానీ ఈ చర్యలతో సాధారణ ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా వారు ఆందోళనకు దిగారు. అయితే అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వారికి సర్దిచెప్పి , ట్రాఫిక్‌ నియంత్రణ పనులు వేగవంతం చేస్తున్నారు.

వివరాలు 

కులూ-మనాలి మధ్య అనేక చోట్ల కోతకు గురైన  రహదారి 

మండి-కులూ ప్రాంతంలోనే దాదాపు 12 చోట్ల కొండచరియలు విరిగిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతేకాక బియాస్‌ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో కులూ-మనాలి మధ్య అనేక చోట్ల రహదారి కోతకు గురైనట్లు ఎన్‌హెచ్ఏఐ ఇంజినీర్‌ అశోక్‌ చౌహాన్‌ తెలిపారు. పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ విహారయాత్రలను సక్రమంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.