LOADING...
Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!
ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!

Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మూడు కీలక కారిడార్లను ప్రకటించారు. అవి హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె మార్గాలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులపై రైల్వే శాఖ ప్రాథమిక కసరత్తులు ప్రారంభించింది. లొకేషన్ సర్వేలు, డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భూసేకరణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో సుమారు 500 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

వివరాలు

శంషాబాద్ సమీపంలో భూమి

శంషాబాద్ సమీపంలో ఈ భూమిని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగింది. ఫ్యూచర్ సిటీ-అమరావతి-బంద్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే, మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ వంటి పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2028 నాటికి తెలంగాణలో రోడ్ల అభివృద్ధిని పూర్తిస్థాయిలో చేపడతామని తెలిపారు. ఇక బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తి అయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

వివరాలు

బుల్లెట్ రైళ్ల ద్వారా కేవలం 3.5 గంటల్లోనే ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు చేరుకోవడానికి 12 నుంచి 15 గంటల వరకు పడుతుండగా, బుల్లెట్ రైళ్ల ద్వారా కేవలం 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైళ్లు గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు. ఇప్పటికే నడుస్తున్న వందే భారత్ రైళ్లు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటితో పోలిస్తే బుల్లెట్ రైళ్లు మరింత వేగంగా ప్రయాణించే అవకాశముంది. దీంతో భవిష్యత్తులో ప్రయాణ సౌకర్యం మరింత సులభం, వేగవంతం కానుంది

Advertisement