Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు సుమారు 500మంది మహిళా కళాశాల విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్, మహిళా కమిషన్‌కు లేఖలు కూడా రాశారు.
ప్రొఫెసర్ తన ఛాంబర్‌కు అమ్మాయిలను పిలిచి వారితో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నాడని లేఖలో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ వికృత చేష్టలపై విచారణ జరిపించాలని అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ అసభ్యకరమైన చేష్టలకు పాల్పడుతున్నారని, అమ్మాయిలను తన కార్యాలయానికి పిలిచి, వారిని బాత్రూమ్‌కు తీసుకువెళతారని ఆరోపించారు.
ప్రైవేట్ పార్ట్‌లను కూడా తాకుతాడని, ఈ విషయం బయటకు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రొఫెసర్ బెదిరిస్తున్నాడని లేఖలో ఆరోపించారు.
హర్యానా
సిట్‌ను ఏర్పాటు
ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సదరు ప్రొఫెసర్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
గతంలో యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ప్రొఫెసర్‌కు రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా, ప్రాథమిక విచారణ అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఏఎస్పీ దీప్తి గార్గ్ తెలిపారు.
లేఖలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. విచారణలో తేలిన వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.