Loading...
Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్టు' పేరుతో రిటైర్డ్ ఐటీ అధికారికి రూ.51 లక్షల టోకరా
'డిజిటల్ అరెస్టు' పేరుతో రిటైర్డ్ ఐటీ అధికారికి రూ.51 లక్షల టోకరా

Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్టు' పేరుతో రిటైర్డ్ ఐటీ అధికారికి రూ.51 లక్షల టోకరా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

'డిజిటల్ అరెస్టు'పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ రిటైర్డ్ ఐటీ అధికారిని భయపెట్టి రూ.51 లక్షలు కాజేశారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన బాధితుడికి మోసగాళ్లు వీడియోకాల్ చేశారు. తాము లఖ్‌నవూకు చెందిన పోలీసు అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. హవాలా కేసులో ఆయనను'డిజిటల్ అరెస్టు'చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. బాధితుడి ధ్రువపత్రాలను ఉపయోగించి ఓ ప్రయివేటు బ్యాంకులో ఖాతా తెరిచారని, ఆ ఖాతా ద్వారా భారీగా హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని మోసగాళ్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని పేర్కొన్నారు. దీంతో బాధితుడు తాను ఎప్పుడూ లఖ్‌నవూకు వెళ్లలేదని,అక్కడి ఏ బ్యాంకులోనూ తనకు ఖాతా లేదని వివరించినా వారు పట్టించుకోలేదు.

వివరాలు 

పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం

ఈ కేసులో కనీసం పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ మరింత భయాందోళనకు గురిచేశారు.

అంతేకాకుండా ఈ విషయం కుటుంబ సభ్యులు లేదా ఇతరులకు చెప్పొద్దని బాధితుడిని ఆదేశించారు.

కేసు విచారణ పూర్తయ్యే వరకు నిరంతరం వీడియోకాల్‌లో అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇదంతా దర్యాప్తులో భాగమేనంటూ ఆయన నుంచి బ్యాంకు ఖాతా వివరాలను కూడా సేకరించారు.

ఆ తర్వాత కేసు నుంచి బయటపడేలా చేస్తామని నమ్మబలికారు.

వారి మాటలను నమ్మిన రిటైర్డ్ అధికారి, మోసగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు విడతలవారీగా మొత్తం రూ.51 లక్షలు బదిలీ చేశారు.

అనంతరం తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాలు 

సాంకేతిక ఆధారాల ఆధారంగా ఆపరేటర్‌ అరెస్టు

సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అబ్దుల్ హమీద్ అనే ఆపరేటర్‌ను అరెస్టు చేశారు.

ఈ మోసంలో మరికొందరు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. మిగతా ముఠా సభ్యులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ADVERTISEMENT