Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు రూ.521.58 కోట్లతో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చేపట్టనున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్కరణల కమిటీ (ఎస్‌డీఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.521.58 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంలో అదనంగా 100 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వివరాలు
రూ.176.04 కోట్లతో స్కాడా వ్యవస్థ
ఈ ప్రణాళికలో భాగంగా రాజమహేంద్రవరంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ,కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.345.54 కోట్లతో 22/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం,అదనపు విద్యుత్ లైన్ల ఏర్పాటు,పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టాలని నిర్ణయించారు.
అలాగే విశాఖపట్నం,రాజమహేంద్రవరం నగరాల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రూ.176.04 కోట్లతో స్కాడా (SCADA) వ్యవస్థను ఆధునికీకరించి అభివృద్ధి చేయాలని కమిటీ ఆదేశించింది.
ఇదే సమావేశంలో సంస్కరించిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) కింద మిగిలిన విద్యుత్ పనులను పూర్తి చేసేందుకు గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో పాటు రాష్ట్రంలోని డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు.