Loading...
Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు
మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు

Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 8 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ (మోర్త్‌) ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, పోర్టు ప్రారంభానికి ముందే ఈ అనుసంధాన హైవేను పూర్తి చేసే అవకాశం ఏర్పడింది.

వివరాలు 

విస్తరణకు సుమారు రూ.1,100 కోట్ల వరకు వ్యయం

ప్రస్తుతం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 64 కిలోమీటర్ల జాతీయ రహదారి-65ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఈ విస్తరణకు సుమారు రూ.1,100 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రహదారి మచిలీపట్నం శివారులోని సుల్తాన్‌నగర్‌ వద్ద కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి-216ను కలుస్తుంది.

అదే ప్రాంతం నుంచే మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే కొత్త హైవే పనులు ప్రారంభమవుతాయి.

సుల్తాన్‌నగర్‌ కూడలి వద్ద ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఫ్లైఓవర్‌ను ఆరు వరుసల ఫ్లైఓవర్‌గా విస్తరించనున్నారు.

అక్కడి నుంచి జాతీయ రహదారి-216పై పెడన వైపు హర్ష కాలేజీ సమీపం వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తారు.

వివరాలు 

ఎంపీ వి. బాలశౌరి కృతజ్ఞతలు

హర్ష కాలేజీ దగ్గర నుంచి కుడివైపునకు మళ్లించి, పోర్టుకు వెళ్లేలా మరో నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా కొత్తగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించనున్నారు.

అంటే మొత్తం 8 కిలోమీటర్ల అనుసంధాన రహదారిలో నాలుగు కిలోమీటర్లు ప్రస్తుత రహదారి విస్తరణగా, మిగిలిన నాలుగు కిలోమీటర్లు కొత్త రహదారి నిర్మాణంగా చేపట్టనున్నారు.

మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు భారీ నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి మచిలీపట్నం జనసేన ఎంపీ వి. బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

క్లోవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజ్‌ లేకపోతే ఎలా?

మచిలీపట్నం శివారులోని సుల్తాన్‌నగర్‌ వద్ద విజయవాడ హైవే,కత్తిపూడి-ఒంగోలు హైవే కలిసే ప్రాంతంలో తొలుత క్లోవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజ్‌ వంతెన నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది.

అయితే దీనికి నాలుగు వైపులా విస్తారమైన భూములు అవసరం కావడంతో స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో క్లోవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజ్‌ ప్రతిపాదనను విరమించుకుని, దానికి బదులుగా డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలని నిర్ణయించారు.

ఈ ప్రణాళిక ప్రకారం, పోర్టు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా విజయవాడ దిశలోని జాతీయ రహదారి-65లోకి చేరుకునేలా సుల్తాన్‌నగర్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పైనే మరో ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు.

అయితే ఆ కూడలిలో పూర్తి స్థాయి ఇంటర్‌ఛేంజ్‌ లేకపోతే భవిష్యత్‌లో రాకపోకల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

సరకు రవాణాకు సమయం తగ్గుతుంది: నితిన్‌ గడ్కరీ

జాతీయ రహదారి-65, 216 జంక్షన్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే రహదారి నిర్మాణానికి రూ.573.77 కోట్లు మంజూరైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించారు.

ఈ రహదారి వల్ల పోర్టుకు సరుకు రవాణా చేసే సమయం గణనీయంగా తగ్గుతుందని, లాజిస్టిక్స్‌ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు వరుసల ప్రధాన రహదారి, సర్వీస్‌ రోడ్లు, మూడు చోట్ల ఫ్లైఓవర్లు, ఒక రైల్వే వంతెనను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.

ADVERTISEMENT