LOADING...
Bhadrachalam: భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి
భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి

Bhadrachalam: భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.586 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశ పనుల కోసం రూ.351 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆలయం, పట్టణం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందేలా పనులు చేపడతారు. మొదటి దశలో గోదావరి ఘాట్‌ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించనున్నారు.

వివరాలు 

మూడో దశలో భద్రాచలం పట్టణ అభివృద్ధి

ఈ దశకు గాను గోదావరి ఘాట్ అభివృద్ధికి రూ.75 కోట్లు, ఆలయ సముదాయం అభివృద్ధికి రూ.180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. తదుపరి దశల్లో కూడా పెద్ద ఎత్తున పనులు కొనసాగనున్నాయి. రెండో దశలో ఆలయం సమీప ప్రాంతాల అభివృద్ధి పనులు చేపట్టగా, మూడో దశలో భద్రాచలం పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం పనులు 2026 సంవత్సరంలోనే ప్రారంభం కానున్నాయి. గత ఏడాది భద్రాచలం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకే ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడం, క్షేత్ర వైభవాన్ని మరింతగా పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. భారీ నిధులకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement