Liquor: మూడ్రోజుల్లోనే రూ.658 కోట్ల మందు తాగేశారు
న్యూ ఇయర్ వేడుకలు అంటే మామూలుగా ఉండదు. మందు సుక్కతో పాటు ముక్క కూడా ఉండాల్సిందే. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ఇక తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నెల 29, 30, 31 తేదీల్లో రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి.
రికార్డు స్థాయిలో చికెన్ విక్రయాలు
రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. మూడ్రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు సమాచారం. ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. లిక్కర్ తో పాటు కూల్ డ్రింక్స్ అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో పాటు చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. సాధరణ రోజుల్లో రోజుకు 3లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగ్గా, ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి.