
కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉన్నట్లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్.వెంకటరమణితో ఆందోళన వ్యక్తం చేసింది.
నవంబర్ 11, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు పేర్కొంది.
నాలుగు రోజుల క్రితం వరకు 80 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పది ఫైళ్లను నాలుగు రోజుల క్రితం ఆమోదించిందని ధర్మసనం పేర్కొది.
దీంతో సిఫార్సుల పెండింగ్ సంఖ్య 70కి చేరుకున్నట్లు వెల్లడించింది.
సుప్రీంకోర్టు
అక్టోబర్ 9 నాటికి కేంద్రం వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
వివిధ హైకోర్టుల్లోని కొలీజియంలు సిఫార్సు చేసిన 70మంది పేర్లను ఇంకా సుప్రీంకోర్టు కొలీజియంకు ఎందుకు పంపలేదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పెండింగ్ ఫైళ్లపై అక్టోబర్ 9 నాటికి కేంద్రం వివరణను సమర్పించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణికి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు కొలీజియంలు తమ సిఫార్సులను చేసిన తర్వాత నాలుగు నెలల్లో సుప్రీంకోర్టు కొలీజియంకు పంపాల్సి ఉంటుంది.
కానీ 10 నెలలు దాటినా ఎందుకు పంపలేదని ధర్మాసనం అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.
ప్రతి 10 రోజులకు ఒకసారి కొలీజియం నియామకాల స్థితిని తాను పర్యవేక్షిస్థానని ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
జస్టిస్ కౌల్ డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేయబోతున్నారు.