LOADING...
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు
మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు

Honeymoon Murder: మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ (Meghalaya Honeymoon Murder) కేసులో రాజా రఘువంశీ హత్యపై మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో మృతుడి భార్య సోనమ్‌ రఘువంశీ(Sonam Raghuvanshi), ఆమె ప్రియుడు రాజ్‌ కుశ్వాహా సహా ఐదుగురిపై అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మరిన్ని ఫోరెన్సిక్‌ రిపోర్టులు అందిన తరువాత మరో ముగ్గురిపై అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ వెల్లడించింది. సోనమ్‌ దాక్కున్న భవన యజమానిని కూడా నిందితుడిగా చేర్చారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాత కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

Details

కేసు నేపథ్యం ఇదే

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 11న అతను సోనమ్‌తో వివాహం చేసుకున్నాడు. అనంతరం 20న హనీమూన్‌ కోసం ఈ కొత్త దంపతులు మేఘాలయకు వెళ్లారు. కానీ అక్కడి నుంచి కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు కనుగొన్నారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో ఇది హత్య అని నిర్ధారించారు. తదుపరి అన్వేషణలో సోనమ్‌ కనిపించకపోగా, జూన్‌ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్‌ కుశ్వాహాతో కలిసి భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.