గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్
అసోంలోని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ సహా ఆమె కుతురుపై 8 మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.అత్యాచారం అనంతరం నిందితులు తల్లీ కుమార్తెల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి పారిపోయారు. మే 17న ఈ ఘోర ఘటన జరిగింది. అయితే బాధితురాలు బధిరురాలు (చెవిటి) కావడంతో ఇన్నాళ్లు విషయం వెలుగులోకి రాలేదు. గువాహటిలోని సత్‌గావ్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. తొలుత ఈ విషయాన్ని చూసి చూడనట్టుగానే వదిలేసేందుకు పోలీసులు యత్నించారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ దారుణం వెలుగులోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్
అసలేం జరిగిందంటే : వివాహం విచ్ఛిన్నమయ్యాక బాధిత యువతి తల్లితో కలిసి నివసిస్తోంది.ఈ క్రమంలో నిందితుల్లో ఒకడైన అరుణ్ ప్రధాన్ (55) అలియాస్ లూటే ప్రధాన్ బాధితురాలి తల్లితో వివాహేతర సంబంధానికి ప్రయత్నించాడు. సదరు విషయం ప్రధాన్ కుటుంబీకులకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే అరుణ్ ప్రధాన్ కుమారుడు అమిత్ మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి బాధితుల ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం తల్లీ కూతుళ్లపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు.విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనతో సృహ కోల్పోయిన బాధితులను పోలీసులు గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ జరిగిన దారుణంపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి.