LOADING...
Andhra News: పోర్టులకి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు.. రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు
రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు

Andhra News: పోర్టులకి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు.. రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ తీరం వెంట ఉన్న ఓడరేవుల పరిసర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో మొత్తం 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్నవీ, నిర్మాణంలో ఉన్నవీ అయిన పోర్టులను కేంద్రంగా చేసుకొని ఈ నగరాలను దశలవారీగా ఏర్పాటు చేయనుంది. ప్రతి పోర్టు అవసరాలు, భవిష్యత్ అవకాశాలకు అనుకూలంగా క్లస్టర్ల ఏర్పాటు కోసం ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) విస్తృత ప్రతిపాదనలను సిద్ధం చేసింది. విశాఖపట్టణం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల చుట్టుపక్కల ప్రాంతాలను ఈ ప్రణాళికలో అభివృద్ధి చేయనున్నారు. పోర్టు కేంద్రంగా 100 కిలోమీటర్ల పరిధిని 'పోర్టు ప్రాక్సిమల్‌ ఏరియా'గా గుర్తించి, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

వివరాలు 

స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను ఏపీఎంబీ అమల్లోకి..

ఈ ప్రాంతాన్ని గోదాములు, నివాస కాలనీలు, కార్యాలయాల స్థలాలు, పరిశ్రమల పార్కులు తదితర అవసరాలకు అనువైన జోన్లుగా విభజించి, వాటి ప్రాతిపదికన భవిష్యత్తులో ఏర్పాటు కాబోయే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను ఏపీఎంబీ అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న సరుకు రవాణా వ్యవస్థలు, తీరప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని పోర్టు ఆధారిత గ్రామాలను సమగ్ర ఆర్థిక నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అధికారులు క్రమానుగతంగా విస్తరణ ప్రణాళిక రచించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ మౌలిక వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ఏర్పాటు చేయడం ద్వారా అనేక రంగాలకు చెందిన క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వ సహకారం

ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, నౌకా నిర్మాణ సంస్థలు, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్ కంపెనీలు విస్తరించే అవకాశం ఉంది. వీటివల్ల తీరప్రాంతాల్లో పట్టణీకరణ వేగం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ఎగుమతులకు కొత్త ఊతం లభిస్తుంది. పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మొత్తం రూ.10,522.90 కోట్లతో పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రాజెక్టుల్ని సాగరమాల ఫేజ్‌-2పథకం కింద అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించేలా రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పోర్టును కేంద్రంగా చేసుకొని ప్రత్యేకత కలిగిన క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో మెరైన్ - ఫార్మా క్లస్టర్ ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ రంగాల ఎగుమతులను అభివృద్ధి చేయనున్నారు.

Advertisement

వివరాలు 

కాకినాడ పరిధిలో పెట్రోలియం లాజిస్టిక్స్ హబ్

మూలపేట ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్ కేంద్రాలు, శిక్షణ సంస్థలతో కూడిన క్లస్టర్ ఏర్పాటు చేసి ఫార్మా, బయోటెక్, రసాయన ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు కల్పించనున్నారు. రాంబిల్లిలో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్ ఏర్పాటు చేసి, హై సెక్యూరిటీ మౌలిక వసతులు అందించనున్నారు. కాకినాడ పరిధిలో పెట్రోలియం లాజిస్టిక్స్ హబ్‌తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్‌తో ఈవీ తయారీ, ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రామాయపట్నం ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేసి, అంతర్గత పంపిణీ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు.

Advertisement

వివరాలు 

కృష్ణపట్నంలో ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్ ఏర్పాటు

దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్ భాగంగా మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్‌యార్డు, మాడ్యులర్ డ్రై డాక్‌యార్డులతో సంపూర్ణ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నంలో ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్ ఏర్పాటు చేసి క్లీన్‌టెక్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్ ప్లాంట్లు, కార్ల ఎగుమతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు రూ.50 కోట్లు, నీటి సరఫరాకు రూ.50 కోట్లు, పోర్టు పరిధిలో సమగ్ర అభివృద్ధి కోసం రూ.2,089.48 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.120 కోట్లు

కృష్ణపట్నం పోర్టు పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.1,376.62 కోట్లు, మూలపేట పోర్టు పరిధిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.6,742.80 కోట్లు వ్యయాన్ని ప్రతిపాదించారు. అలాగే రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.120 కోట్లు, విద్యుత్ సరఫరాకు రూ.50 కోట్లు, నీటి సరఫరాకు మరో రూ.50 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

Advertisement