కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి
కర్ణాటకలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఫోన్ ఛార్జర్ నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కార్వార్ తాలూకాలో చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదం బాధిత కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సంతోష్ హెస్కామ్, హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ(విద్యుత్ పంపిణీ సంస్థ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య సంజన, 8 నెలల కూతురు సానిధ్య ఉన్నారు. ఎప్పటిలాగే రోజూవారీగా విధులకు వెళ్లే ముందు తన మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకున్నారు. అనంతరం ఫోన్ తీసుకుని విధులకు వెళ్లిపోయారు. అయితే సదరు ఛార్జర్ ను స్విఛ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోయారు.
ఛార్జర్ వైరును నోట్లో పెట్టుకుంది
ఈ క్రమంలో ఇంట్లో ఆడుకుంటోన్న కుమార్తె సానిధ్య, కిందికి వేలాడుతున్న ఛార్జర్ వైరును నోట్లో పెట్టుకుంది. దీంతో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టింది. ఘటనతో అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు హుటాహుటిన సానిధ్యను తమ ఇంటికి సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప ఊపిరి ఆగిపోయిందని వైద్యులు ప్రకటించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు పుట్టెడు దుఖఃంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ ఉపకరణాలు (ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం) విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన నొక్కి చెబుతోంది.