Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార కూటమి, విపక్షాలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో 5 కోట్ల మంది పైగా పురుషులు, 4.6 కోట్ల మంది మహిళలున్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే 18-19 ఏళ్ల యువ ఓటర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 22.22 లక్షల మంది మాత్రమే ఉన్నారు. శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నారని ఈసీ ధ్రువీకరించింది. అక్టోబరు 15న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో రాష్ట్రంలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
72 లక్షలు పెరిగిన ఓటర్ల సంఖ్య
అక్టోబరు 19వరకు కొత్తగా 6.55 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఓటర్ల సంఖ్య 72 లక్షలు పెరిగింది. పుణె జిల్లా 88.49 లక్షల ఓటర్లతో అగ్రస్థానంలో ఉండగా, ముంబయి సబర్బన్‌లో 76.86 లక్షలు, ఠాణెలో 72.29 లక్షలు, నాసిక్‌లో 50.61 లక్షలు, నాగ్‌పుర్‌లో 45.25 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా సింధ్‌దుర్గ్ జిల్లాలో 6.78 లక్షల ఓటర్లు ఉన్నారు. గత 13 అసెంబ్లీ ఎన్నికల్లో సగటు ఓటింగ్ 62.2 శాతం కాగా, అత్యధికంగా 1995లో 71.6 శాతం, అత్యల్పంగా 1980లో 53.3 శాతం నమోదైంది. 2019లో 61.1 శాతం ఓటింగ్ నమోదైంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 20న పోలింగ్ జరగనుంది.
నవంబర్ 23న ఫలితాలు
ఫలితాలు నవంబరు 23న వెలువడతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ మిత్ర కూటమి తమ విజయానికి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కూడా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో బలంగా బరిలోకి దిగుతోంది.