Manjeera River: ఉప్పొంగుతున్న మంజీరా.. సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు జలకళ
మంజీరా నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండిపోయినా, మంజీరా నది పై ఉన్న సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదు. అయితే, గత వారం రోజులుగా కర్ణాటక,మహారాష్ట్రల నుండి మంజీరాకు నిరంతరం వరద ప్రవహించడంతో, నదీ పరివాహక ప్రాంతం నిండి పోయింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో, ప్రాజెక్టులకు నీరు చేరింది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల బోర్డర్‌లో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు బుధవారం సాయంత్రం ఒక గేట్ ద్వారా నీటిని వదిలివేసింది, తద్వారా సింగూరు ప్రాజెక్టు గేట్లు గురువారం లేవడానికి నీటిపారుదల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
నిజాంసాగర్ లో పూర్తిస్థాయి నీటి మట్టం 17.801 టీఎంసీలు
మహారాష్ట్రలో బాలఘాట్ రేంజ్ లో ఉద్భవించే మంజీరా నది, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణించి, సంగారెడ్డి జిల్లాలో జన్వాడ వద్ద తెలంగాణలోకి ప్రవహిస్తుంది. మంజీరా నది మీద నిర్మించబడిన అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూరు,సంగారెడ్డి జిల్లాలో పుల్కల్ మండలంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు. గురువారం ఉదయం,ప్రాజెక్ట్ లోకి 45,000 క్యూసెక్స్ నీరు ప్రవహిస్తున్నది, దీంతో నీటి నిల్వ 27.81 టీఎంసీలకు చేరుకుంది. జెన్కో అధికారులు గురువారం ఉదయం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాజెక్ట్ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. నిజాంసాగర్ లో పూర్తిస్థాయి నీటి మట్టం 17.801 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 16.5 టీఎంసీలు చేరుకున్నాయి.
పొంగిపొర్లుతున్నమంజీరా
నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా క్రెస్ట్ గేట్ లేపి, 2,000 క్యూసెక్స్ నీటిని వదలడం ప్రారంభించారు. ప్రస్తుతం నిజాం సాగర్ లో సుమారుగా 30,000 క్యూసెక్స్ నీరు ప్రవహిస్తోంది. సింగూరు గేట్లు ఎత్తడం ద్వారా ఈ ప్రవాహం పెరుగుతుందని అంచనా. సంగారెడ్డి పట్టణం దగ్గర నిర్మించిన మంజీరా డాం కూడా పొంగిపొర్లుతోంది. ఈ డాం పూర్తి స్థాయి నీటి నిల్వ 1.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్ట్ నిండడంతో క్రెస్ట్ గేట్లు లేపి, మంగళవారం సాయంత్రం నీటిని నది ప్రవాహంలోకి వదిలారు. మెదక్ జిల్లాలో మంజీరా నదిపైన నిర్మించిన ఏడుపాయల ప్రాజెక్టు కూడా గత వారం రోజులుగా పొంగిపొర్లుతోంది.
నిండిన పోచారం
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంజీరా, గోదావరి నదులకు ఉపనదులైన నక్కవాగు, నల్లవాగు, హల్దీవాగు, కూడాలేరు, మోయతుమ్మెద వాగు, పెద్ద వాగు, గుండు వాగు, సిద్దిపేట వాగు తదితర వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు కూడా గత మూడు రోజులుగా పొంగిపొర్లుతోంది. పోచారం డ్యామ్ కూడా మూడురోజులుగా నిండిపోయి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టులకు జలకళ సంతరించడంతో, యాసంగి పంటలకు అవసరమైన నీటికి ఎటువంటి డొకా ఉండదని రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.