LOADING...
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి 
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్‌.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా చేపట్టారు. నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతోపాటు పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన వైమానిక స్థావరాలు తీవ్రంగా నాశనమయ్యాయని సమాచారం. తాజాగా, పాకిస్థాన్‌కు చెందిన 9 విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. కేవలం విమానాలే కాదు, పాకిస్థాన్ సైనిక ఆస్తులకూ గణనీయమైన నష్టం జరిగినట్టు చెబుతున్నారు.

వివరాలు 

రెండు ఎయిర్‌బోర్న్ నిఘా విమానాలు పూర్తిగా ధ్వంసం 

సమాచారం ప్రకారం..పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు,రెండు ఖరీదైన నిఘా విమానాలు,పదికి పైగా ఆయుధాలతో కూడిన డ్రోన్లు,అలాగే ఒక సీ-130హెర్క్యులస్ రవాణా విమానం భారత్‌ జరిపిన దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఈవాహనాలన్నీ పాక్‌ వైమానిక సామర్థ్యానికి కీలకమైనవే కావడం గమనార్హం. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అత్యంత విలువగల రెండు ఎయిర్‌బోర్న్ నిఘా విమానాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు,పాకిస్థాన్‌లోని భోలారి వైమానిక స్థావరంలో నిలిపివున్న స్వీడన్‌కు చెందిన ఏఈడబ్ల్యూసీ (AEW&C)విమానం కూడా ఉపరితల క్రూయిజ్ క్షిపణి దాడిలో నాశనం అయిందని తెలుస్తోంది. ఈదాడిలో విమానం పూర్తిగా ధ్వంసమయ్యిందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా స్పష్టమవుతోంది. ఇదేసమయంలో,పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడుల్లో సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం కూడా పాడైంది.

వివరాలు 

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు

ఈ విమానం సాధారణంగా లాజిస్టికల్ మద్దతు కోసం ఉపయోగించబడుతుంది. డ్రోన్ దాడి సమయంలో ఇది ముల్తాన్ సమీపంలో ఉన్న ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ వద్ద నిలిపివుండేదని సమాచారం. ఇదంతా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌ తీసుకున్న గట్టి చర్యలలో భాగమే. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భారత్ ప్రతీకార ధోరణిలోకి వెళ్లింది. పాకిస్థాన్‌కు ఇస్తున్న సింధు నదుల నీటిని నిలిపివేసింది. పాక్ పౌరులకు వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు గేటును మూసివేసింది. చివరికి మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించి, పాక్‌ పైన బలమైన మెసేజ్ ఇచ్చింది. ఈ దాడుల ప్రభావంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి కాల్పుల విరమణపై భారత్‌ ప్రతిపాదనను అంగీకరించింది.