
Himachal Pradesh: హిమాచల్ లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ. దూరంలో నలుగురి మృతదేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 91కి చేరింది. రాష్ట్రంలోని అనేక ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో,మెరుపు వరదలు, భారీ వర్షాల కారణంగా పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వర్షాల ధాటికి కొట్టుకుపోయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రహదారులపై పదుల సంఖ్యలో శవాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకి చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాపుర్ ప్రాంతంలో లభ్యమయ్యాయి.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా 91 మంది మరణించగా,34 మంది గల్లంతయ్యారు
మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు చాలా దూరం వరదలలో కొట్టుకుపోతుండడంతో, వాటిని గుర్తించి ఆయా కుటుంబాలకు అప్పగించడం పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 91 మంది మరణించగా,34 మంది గల్లంతయ్యారు. మరోవైపు,సుమారు 130 మంది వరదల వల్ల గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం 207 రహదారులు మూసివేశారు.
వివరాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్
అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందల సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను వదిలి నిరాశ్రయులయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది. కొండచరియలు విరిగే ప్రమాదం ఉండటంతో, బలహీన నిర్మాణాలైన ఇళ్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.