LOADING...
Swati Maliwal: ఆప్‌కు భారీ షాక్‌.. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా
ఆప్‌కు భారీ షాక్‌.. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా

Swati Maliwal: ఆప్‌కు భారీ షాక్‌.. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి దూరంగా ఉన్న ఆమె, తాజా పరిణామాల్లో తిరుగుబావుటా ఎగరేసి కాషాయ గూటికి చేరినట్లు ప్రకటించారు. లిక్కర్ స్కామ్‌ కేసుతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆప్‌కు ఇది మరో పెద్ద షాక్‌గా మారింది. గతంలో అరవింద్ క్రేజీవాల్ నివాసంలో జరిగిన దాడి ఘటన తర్వాత స్వాతి మాలివాల్ పార్టీకి దూరమయ్యారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేదు. ఇదే సమయంలో ఆప్‌లో పెద్ద ఎత్తున విభేదాలు బయటపడ్డాయి. పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు తిరుగుబావుటా ఎగరేశారు.

వివరాలు

2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటన

ఈ ఎంపీలు నితిన్ నబిన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురు నేరుగా భేటీ కాగా, మరో నలుగురు కూడా బీజేపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చారు. అనర్హత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లు రాఘవ చద్దా వెల్లడించారు. శుక్రవారం రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ బీజేపీ నేతలను కలిశారు. వీరితో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

వివరాలు

కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా అశోక్ మిట్టల్

ఇందులో అశోక్ మిట్టల్ పాత్ర విశేషంగా చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన, ఒకప్పుడు తన నివాసంలో కేజ్రీవాల్‌కు ఆశ్రయం ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఏప్రిల్‌ 2న జరిగిన మరో కీలక పరిణామంలో, రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను తప్పించి, అశోక్ మిట్టల్‌ను ఆ స్థానంలో నియమించింది ఆప్. ఈ నిర్ణయం కూడా పార్టీలో అంతర్గత అసంతృప్తికి దారితీసినట్లు భావిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత స్వాతి మాలివాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వివరాలు

మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం

"నాకు ఎవరిపైనా భయం లేదు. దేశంలో ఏ సంస్థ నన్ను భయపెట్టలేదు. అరవింద్ కేజ్రీవాల్‌తో మంచి వ్యక్తులు కలిసి పనిచేయడం లేదు. తానే అవినీతిలో కూరుకుపోయి ఇతరులపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం తనపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, అదే కారణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రస్తుత పరిస్థితికి బయటి వారు కారణం కాదని, కేజ్రీవాల్ నాయకత్వంపై అసంతృప్తి పెరగడమే అసలు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

Advertisement