LOADING...
Weather Forecast: మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

Weather Forecast: మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలులు, అలాగే విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు.

వివరాలు

ఆదివారం వాతావరణ సూచనలు

వ్యవసాయ పనులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఆదివారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో అల్లూరి జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండొచ్చని వెల్లడించారు.

వివరాలు

శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పోలవరం జిల్లా యేర్రంపేటలో 40.5°C, నంద్యాల జిల్లా సంజామలలో 40.4°C నమోదయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం, కడపలో 40.3°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 40.2°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 40.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Advertisement