
Chennai: ట్రయాంగిల్ లవ్.. ప్రేమను తిరస్కరించిన యువతిని సజీవ దహనం చేసిన ట్రాన్స్ జెండర్
ఈ వార్తాకథనం ఏంటి
ట్రయాంగిల్ లవ్ ఉదంతం.. 25ఏళ్ల యువతి దారుణ హత్యకు కారణమైంది.
చెన్నై శివారులోని తాళంబూరులో మహిళా టెక్కీని ఓ ట్రాన్స్ జెండర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
ఆ యువతిని గొలుసుతో కట్టి, బ్లేడుతో గాయాలు చేసి.. సజీవ దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
సగం కాలిన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చనిపోయిన యువతిని ఆర్. నందినిగా గుర్తించారు.
ఆర్. నందిని మృతదేహం గొలుసుతో బంధించబడిందని, ఆమె మెడ, చేతులు, కాళ్ళపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో 27 ఏళ్ల ట్రాన్స్‌మ్యాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించినందుకే నందినిని మధురైకి చెందిన ట్రాన్స్‌మ్యాన్ వెట్రిమారన్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
చెన్నై
పుట్టినరోజున సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి..
వెట్రిమారన్, నందిని గత కొన్ని నెలలుగా తొరైపాక్కంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులుగా మారారు.
అయితే ఇటీవల వెట్రిమారన్ తన జెండర్ ఐడెంటిటీ గురించి నందినికి చెప్పి ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె అతనిని ప్రపోజ్‌ను తిరస్కరించింది.
ఆ తర్వాత నందిని వేరే వ్యక్తిలో ప్రేమలో పడింది. ఇది వెట్రిమారన్‌కు కోపం తెప్పించింది.
ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. నందిని పుట్టినరోజు శనివారం కావడంతో.. సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్లాడు.
ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, గొలుసులతో కట్టేసి, బ్లేడ్‌తో గాయపరిచి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.