LOADING...
Ayodhya: అయోధ్యలో దివ్య క్షణం.. బాలరాముడి నుదుటిపై 'సూర్య కిరణాల' తిలకం

Ayodhya: అయోధ్యలో దివ్య క్షణం.. బాలరాముడి నుదుటిపై 'సూర్య కిరణాల' తిలకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం జరుపుకుంటున్న మూడో శ్రీరామనవమి కావడంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ఏర్పడిన 'సూర్య తిలకం' చూసి భక్తులు పరవశించారు. పండుగను పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ మూడో అంతస్తులో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక ప్రత్యేక నిర్మాణాన్ని రూపొందించారు.

వివరాలు

శ్రీరామ నవమి రోజే కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు

ఆలయ శిఖరంపై సూర్యకాంతిని గ్రహించే పరికరాన్ని అమర్చగా, అక్కడినుంచి కాంతి పైపుల ద్వారా లోపలికి చేరి తిలకం రూపంలో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఐఐఏ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సహకారంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజునే ఈ 'సూర్య తిలకం' కనిపించేలా అత్యంత కచ్చితత్వంతో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గడియారంలోని ముల్లుల కదలికలను పోలిన గేర్ టీత్ మెకానిజాన్ని వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్ద ప్రత్యేకంగా అమర్చిన అద్దాన్ని ఈ వ్యవస్థ 365 రోజుల పాటు స్వల్పంగా కదిలిస్తూ ఉంటుంది. తద్వారా వచ్చే శ్రీరామనవమి రోజున కిరణాలు సరిగ్గా బాలరాముడి నుదుటిపై పడేలా సెట్ అవుతుంది.

Advertisement