LOADING...
Kadapa Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శుభారంభం.. తొలి దశకు రూ. 4,500 కోట్ల పెట్టుబడి!
కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శుభారంభం.. తొలి దశకు రూ. 4,500 కోట్ల పెట్టుబడి!

Kadapa Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శుభారంభం.. తొలి దశకు రూ. 4,500 కోట్ల పెట్టుబడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్‌ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు వేగం పెంచింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ పెట్టుబడులకు ఆమోదం తెలుపడంతో ప్రాజెక్ట్‌ మొదటి దశ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. మొత్తం రూ.16,350 కోట్ల పెట్టుబడిలో భాగంగా మొదటి దశకు రూ.4,500 కోట్లను కేటాయించారు. రెండో దశ కోసం రూ.11,850 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంట్‌కు అవసరమైన భూమిని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ సంస్థకు ఎకరా రూ.5 లక్షల చొప్పున మొత్తం 1,100 ఎకరాలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్మాణ తాలూకు టైమ్‌లైన్‌ను కూడా ఖరారు చేసింది.

Details

2031 జనవరి నాటికి రెండో దశ నిర్మాణ పనులు

2026 జనవరి నాటికి తొలి దశ పనులు ప్రారంభించాలన్నది లక్ష్యం కాగా, అదే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయాలని నిర్ణయించింది. ఉత్పత్తిని 2029 ఏప్రిల్‌ నాటికి మొదలుపెట్టాలని ఆదేశించింది. 2031 జనవరి నాటికి రెండో దశ నిర్మాణ పనులను ప్రారంభించి, 2034 ఏప్రిల్‌ నాటికి రెండో దశ ఉత్పత్తిని ప్రారంభించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. గతంలోనే ఈ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసినా, పలు కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. తాజా ప్రభుత్వ మార్పుల తర్వాత పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలసి సర్వే నిర్వహించినట్లు సమాచారం.