LOADING...
Northeast: ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్‌వే ప్రారంభం
ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్‌వే ప్రారంభం

Northeast: ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్‌వే ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రక్షణ వ్యూహానికి బలాన్నిస్తూ, పౌర-సైనిక అవసరాలను సమన్వయం చేసే చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎఫ్‌)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోరాన్ బైపాస్ సమీపంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వ్యూహాత్మక రన్‌వేపై ప్రధాని మోదీ C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో ల్యాండయ్యారు. చైనాతో ఎదురయ్యే భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈశాన్య భారతంలో నిర్మించిన తొలి రన్‌వే ఇదే కావడం విశేషం. పౌర, సైనిక అవసరాలను తీర్చేలా దీన్ని రూపకల్పన చేశారు. అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే వీలుంది.

Details

టేకాఫ్, ల్యాండింగ్ నిర్వహించేందుకు ఇది అనుకూలం

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు, యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ నిర్వహించేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఇలాంటి సదుపాయాలు ఉన్నప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలి ఈఎల్‌ఎఫ్‌. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై ఉన్న ఈ రన్‌వే భారత్-చైనా సరిహద్దుకు సుమారు 300 కి.మీ., మయన్మార్‌కు దాదాపు 200 కి.మీ. దూరంలో ఉండటం వల్ల వ్యూహాత్మక ప్రాధాన్యం మరింత పెరిగింది.

Details

ఆకట్టుకున్న ఎయిర్ షో

ఈఎల్‌ఎఫ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రన్‌వేపై డస్సాల్ట్ రాఫెల్, సుఖోయ్ Su-30MKI, C-17 గ్లోబ్‌మాస్టర్ III వంటి యుద్ధ, రవాణా విమానాలతో ఎయిర్ షో నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ. పి. సింగ్ తదితరులు వీక్షించారు. అస్సాంలో ఈఎల్‌ఎఫ్‌ ప్రారంభం గర్వకారణమని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమ వేదిక Xలో పేర్కొన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు వరుసల భారీ వంతెన 'కుమార్ భాస్కర్ వర్మ సేతు'ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,030 కోట్లు వెచ్చించారు. అలాగే ఐఐఎం-గువాహటి, హైటెక్ డేటా సెంటర్‌లను కూడా ప్రారంభించారు.

Advertisement

Details

కాంగ్రెస్‌పై విమర్శలు

గువాహటిలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలని కలలు కనే వారిని, ఈశాన్య ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయాలని నినదించే వారిని హస్తం పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు.

Advertisement