LOADING...
Jharkhand: జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!
జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!

Jharkhand: జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో చాయిబాసా సదర్ ఆస్పత్రిలో సంచలన ఆరోగ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో తలసేమియా బాధిత ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తం ఇచ్చినట్లు ఆరోగ్య అధికారులు గుర్తించారు. ఈ విషయంపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా విచారణకు ఆదేశిస్తూ రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందాన్ని చాయిబాసాకు పంపింది. రాంచీ వైద్యుల బృందం సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)ని తనిఖీ చేసింది. డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ ఈ కేసును పరిశీలిస్తోంది. బాధితులందరి వయసు 15 ఏళ్లలోపు అని అధికారులు తెలిపారు.

Details

అలర్ట్ అయిన ఆరోగ్య శాఖ

గత వారం 56 తలసేమియా రోగులపై నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రాథమిక విచారణలో బ్లడ్ బ్యాంక్‌లో అనేక లోపాలు, నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ఈ కేసు ప్రారంభానికి 7 ఏళ్ల తలసేమియా బాధితుడి తండ్రి ఫిర్యాదు కారణమై, ఆయన తన బిడ్డకు పాజిటివ్ రక్తం ఎక్కించినట్లు ఆరోపించారు. తల్లిదండ్రుల పరీక్షల ఫలితాలు నెగటివ్ గా వచ్చినప్పటికీ, బిడ్డకు పాజిటివ్ వచ్చి ఆరోగ్య శాఖను అలర్ట్ చేసింది. విచారణ బృందం ప్రకారం, చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రావడానికి రెండు కారణాలు ఉండొచ్చు:

Details

సదర్ ఆసుపత్రి ల్యాబ్‌లో అనేక లోపాలు

కలుషిత రక్తం ఇచ్చినట్లయితే లేదా ఇతర మార్గాల ద్వారా సంక్రమణ అయి ఉండడం. పరిశీలనలో సదర్ ఆసుపత్రి ల్యాబ్‌లోనూ అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. విచారణ పూర్తయిన తరువాతే ఈ ఘటనకు అసలు కారణం స్పష్టమవుతుంది. ఈ ఘటనపై రాజకీయ స్పందన కూడా వెల్లువెత్తింది. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ప్రతినిధి అజయ్ షా సోషల్ మీడియా ద్వారా "జార్ఖండ్ ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు జీవితాన్ని కాక మరణాన్ని పంచుతున్నాయి. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని, ఆరోగ్య శాఖ పనితీరును ప్రశ్నిస్తున్నది" అని తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.