Page Loader
Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!
రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!

Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో రూ.500 కోట్లతో ఒక పెద్ద పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం అవుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యం (పీ-4) విధానంలో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో సోమవారం ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ సమావేశంలో పాల్గొనవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటికే విజయవాడలో టూరిజం సమ్మిట్‌ నిర్వహించి 200 పర్యాటక ప్రతిపాదనలు స్వీకరించామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్, తాజ్, మేఫేర్, ఐఆర్‌సీటీసీ సంస్థలు ముందుకు వచ్చాయని ఆయన వెల్లడించారు.

వివరాలు 

అఖండ గోదావరి, గండికోట అభివృద్ధి

అతి త్వరలో మారేడుమిల్లి ఉత్సవ్‌ నిర్వహించి, స్థానిక అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. పాపికొండల పర్యాటక రంగాన్ని పరిశీలించి, పర్యాటక చర్యలను తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో అడ్వెంచర్, ఎకో, వెల్‌నెస్, ఆలయ, హెరిటేజ్, అగ్రి, మెడికల్, బీచ్‌ పర్యాటకాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పలు గ్రామాల్లో ఉన్న మండువా లోగిళ్లను అద్దెకు తీసుకుని సాంస్కృతిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాస్కీ పథకంలో మంజూరైన రూ.177 కోట్లతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన టెండర్లను త్వరలోనే పిలవనున్నట్టు పేర్కొన్నారు.

వివరాలు 

అన్ని ఘాట్లను కలిపేలా..

రాజమండ్రిలో రూ.98 కోట్లతో 2.7 కిలోమీటర్లు ఉన్న హేవ్‌లాక్‌ వంతెనపై పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. అన్ని ఘాట్లను కలిపేలా బోటింగ్‌ సేవలను అందించడంతో పాటు, కడియం నర్సరీలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. సినిమాల బడ్జెట్‌ ప్రకారం టికెట్ల ధరలను పెంచే కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.