Sim Cards: సైబర్ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?
భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సైబర్ క్రైమ్‌లలో ఉపయోగించిన నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విధానానికి అనుగుణంగా సుమారు 2.17 కోట్ల సిమ్ కార్డులను రద్దు అయ్యే అవకాశం ఉంది. అంతేకాక 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాం శాఖ సమర్పించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంది.
సైబర్ నేరాల నివారణకు చర్యలు
ఈ సమావేశానికి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఆర్‌బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఐటీ శాఖ, సీబీఐ, ఇతర భద్రతా ఏజెన్సీలు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. సిమ్ కార్డులు జారీ చేసే సమయానికి కేవైసీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కంబోడియాలో సైబర్ నేరాల గురించి ఇటీవల కాలంలో వచ్చిన వార్తల ప్రకారం, ఆ దేశంలో సుమారు 5,000 భారతీయులు చిక్కుకుపోయారని, వారిని సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నారు.
ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు
డేటా ఎంట్రీ పోస్టులపై భారీ వేతనాల ఆశ చూపించి, సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. టెలీకాలర్లుగా ఫోన్లు చేసి, క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ద్వారా లాభాల ఆశ చూపించే మోసాలు బయటపడ్డాయి. దీంతో కేంద్రం మంత్రిత్వ శాఖలు కలిసి ప్రత్యేక ఉపకమిటీని ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం రంగాలలో గుర్తించిన లోపాలను పరిష్కరించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు.